13, ఏప్రిల్ 2012, శుక్రవారం

తెరుచుకున్న బడి తలుపులు (Updated with Photo)

నిన్నటి సుప్రీం కోర్టు తీర్పుతో ప్రాధమిక విద్యాహక్కు చట్టానికి ఉన్న అవరోధాలు అన్నీ తొలగిపోయినట్టయ్యింది. ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి చట్టాల్లో ఇది చాలా ముఖ్యమైన చట్టం. దేశ భవిష్యత్తుని నిర్దేశించగల సత్తా ఉన్న చట్టం అని చెప్పడానికి ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు.
THE LONG ROAD TO GOOD SCHOOLING: Girls on their way to school near Koraput, Orissa. Photo: K.R. Deepak. Note: Just adding the photo taken from The Hindu with thanks :)

దేశ వ్యాప్తంగా ఎన్నో మౌలిక మైన మార్పులకి ఇది ఒక మంచి ముందడుగు అనడంలో ఎటువంటి సందేహానికీ తావు లేదు. పాఠశాలల నిర్వహణలోనూ, శిక్షణా, బోధనా పద్దతులని ప్రామాణీకరించడంలోనూ, భావి పౌరులకి విద్యని తల్లిదండ్రుల ఆర్థిక స్థాయితో సంబంధం లేకుండా ఒక హక్కుగా అందించడంలోనూ, దేశ నిర్మాణం లో ఎన్నో కీలకమైన మార్పులు తెచ్చే విధంగా ఈ చట్టాన్ని తయారు చేసినందుకు పార్లమెంటుని అభినందించాల్సిందే.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలూ, స్థానిక ప్రభుత్వాలు తమ పరిధిలో అవసరమైన అన్ని వనరులూ సమకూర్చి పటిష్టంగా అమలు చెయ్యడం మీద చాలా మందికి సందేహాలు ఉండొచ్చు. కానీ ప్రజల నుండి కొంత సహకారం, భాగస్వామ్యం లభిస్తే మాత్రం అమలులో లోపాలు చాలా వరకు తగ్గిపోతాయి. ఇంతకుముందు సమాచార హక్కు లాంటి చట్టాన్ని ఎలాగైతే ఉపయోగించుకోగలిగామో అలాగే పౌర సమాజం గనక బాధ్యతగా స్పందిస్తే అద్భుతాలు సృష్టించ గల శక్తి ఈ చట్టానికి ఉందని నేనైతే బల్లగుద్ది చెప్పగలను.

ఇంతకు ముందు ఈ చట్టం వచ్చిన మొదట్లో, వివరాలు నా ఆంగ్ల బ్లాగులో వ్రాశాను. వివరాలు కావలిస్తే చూడొచ్చు. http://weekendpolitician.blogspot.in/2010/04/right-to-education-rte-abc-and-xyz-of.html

వీకెండ్ పొలిటీషియన్ వ్యాఖ్య: I will be working on the ground for this act to the extent my weekend politics allow. I would be delighted to provide any help and material for others who want to work on ensuring the right to Education.

22, మార్చి 2012, గురువారం

అయ్యా రవి శంకరు గారూ, మీరు కాస్త... ;)

ప్రభుత్వ పాఠశాలల్లో చదవే వాళ్ళ నుండే నక్సలైట్లు వస్తారనీ, హింసా ప్రవృత్తి ఉంటుందనీ సెలవిచ్చారట శ్రీ శ్రీ రవిశంకర్ (ఆర్ట్ ఆఫ్ లివింగ్ ) గారు. పైగా అసలు ప్రభుత్వాలు స్కూళ్ళు నడపగూడదనీ, స్కూళ్ళని పూర్తిగా ప్రైవేటు పరం చెయ్యాలని కూడా ఒక అభిప్రాయాన్ని ప్రవచించారంట.

ఆధ్యాత్మిక విషయాల్లో ఆయన గొప్ప వారైతే అయ్యుండొచ్చు గానీ, మిగిలిన విషయాల్లో ఆయన ఆలోచనలూ, అభిప్రాయాలూ ఇంత అపరిపక్వంగా ఉన్నాయనేది చాలా నిరాశ కలిగించే విషయం.

ఆయన ప్రైవెటు రంగం గొప్పదనం గురించి బాకా ఊదాలనుకుంటే అది ఆయన హక్కు, మనం విమర్శించొచ్చు కానీ ప్రాధమిక విద్యా, ప్రాధమిక ఆరోగ్యం లాంటి వాటి నుంచి కూడా ప్రభుత్వాన్ని వైదొలగి ప్రైవేటు పరం చెయ్యమని చెప్పడానికి ఆయన ఎంచుకున్న లాజిక్ మాత్రం హాస్యాస్పదంగానూ, ఆలోచనారహితంగానూ, అవగాహనా లోపంగానూ కనిపించక మానదు.

ఆధ్యాత్మిక విషయాల్లో అంత పేరు ప్రఖ్యాతులు  ఉండీ, చాలామంది జనాలని ప్రభావితం చేసే స్థానంలో ఉన్న వాళ్ళు రాజకీయ, ఆర్థిక విధానాల గురించి మాట్లేడే టప్పుడు, చాలా ఆలోచించి మాట్లాడాలని ఆశించడం అత్యాశ కాదనిపిస్తుంది.

23, జనవరి 2012, సోమవారం

రష్డీ ఇండియాకి ఎందుకు రాకూడదు ?

సల్మాన్ రష్డీ రాసిన పుస్తకాల మీదా ఇంతకు ముందు వివాదాలు చెలరేగిన విషయం మనందరికీ తెలిసిందే. అసలు పుస్తకం మీద వివాదం అవసరమా, లేదా అనేది వేరే విషయం అనుకోండి.


ఆయన ఇప్పుడు మన దేశంలోకి రావటానికి వీల్లేదని కొంతమంది ఫత్వా జారిచేశారంట. ఆయన పుస్తకాలమీద విమర్శలు చేసుకోండి.. కానీ, అసలు రానియ్యం, రావటానికి వీల్లేదు అనటానికి వీళ్ళెవరు? ఇటువంటి బెదిరింపులకి దిగేవాళ్ళని కట్టడి చెయ్యాలిగానీ శాంతి భద్రతలకి భంగం కలిగే అవకాశం ఉంది కాబట్టి రావొద్దని ప్రభుత్వాలు చెప్పడం సిగ్గు పడాల్సిన విషయం. బయటకొస్తే రేపులు జరుగుతున్నాయ్ కాబట్టి స్త్రీలెవ్వరూ బయటకి రావొద్దని చెప్పినట్టు లేదూ !


వివాదం మొదలయ్యి, కొంతమంది ఉన్మాదులు ఆయన్ని చంపడానికి బహిరంగంగా ఫత్వాలూ గట్రా జారీ చెయ్యడం జరిగాక ఆయనొక నాలుగైదు సార్లు ఇండియా వచ్చి వెళ్ళాడు. ఇప్పుడు కొత్తగా సమస్య ఏంటి అనే సందేహం రాక మానదు. కాకపోతే దేశంలో ఇప్పుడు ఎన్నికల సీజన్ నడుస్తుంది కాబట్టి, మన ఉన్మాదులంతా ఇదే సందు ప్రభుత్వాలని డూ డూ బసవన్న ఆడించడానికి అని అతిగా రెచ్చిపోయారు. ఈ ప్రభుత్వాలేమో అలవాటుగా తలాడిస్తున్నాయి అని సరిపెట్టుకోబోయాం గానీ.. ఇంకా ప్రమాదకరమైన విషయాలే ఇందులో ఉన్నట్టనిపిస్తుంది. అసలు వివాదమే ఎన్నికల కోసం సృష్టించబడింది అనే అనుమానాలు కూడా వ్యక్తమవుత్తున్నాయి. ఒకవేళ అదే గనుక నిజమైతే, అది అత్యంత దురదృష్టకరం, గర్హనీయం.


సాధారణంగా పార్లమెంటులో  మాట్లేడేటప్పుడు ఎంత అద్భుతంగా మాట్లాడుతారో అంతే అధ్వాన్నంగా బయట మాట్లాడగల మన ఒవైసీ మహాశయుడు గారు, తమ వంతుగా కొన్ని బెదిరింపులు (నర్మగర్భంగానే అనుకోండి) చేసి అవతల పడేశారు. ఇంతకుముందు కూడా ఇలాగే తస్లీమా నస్రీన్ వచ్చినప్పుడు మన హైదరాబాద్ లో నానా వీరంగం సృష్టించారు. కాకపోతే, అలా చేసిన ఉన్మాదుల చర్యలని ఖండించి ప్రభుత్వాలు వాళ్ళకి ముందస్తుగా తలొగ్గలేదని సంతోషించాం. ఈ సారి మరీ తలదించుకునేలా ప్రభుత్వాలు ప్రవర్తించాయనడం లో తప్పులేదు. మీరేమంటారు?

17, జనవరి 2012, మంగళవారం

An ugly manifestation of వర్ణ(కుల) వ్యవస్థ

ఈ రోజు ఒక వార్తా పత్రికలో(AndhraJyothi) వచ్చిన వార్త ఇది. అసలేం జరిగింది, కధనంలో పోరపాట్లు ఎంతవరకూ ఉండొచ్చు అనేవి ఇంకా పెద్దగా తెలియదనుకోండి. కానీ, చాలా వరకు అక్కడ జరిగిందాన్ని అర్థం చేసుకోవచ్చు.

మహబూబ్‌నగర్ జిల్లా గోపాల్‌పేట మండలం ఏదుట్లలో బోనాల వేడుక ఘర్షణకు దారి తీసింది. అందరూ కలిసి బోనాలు నిర్వహించాలన్న విషయంపై దళితులు, అగ్రవర్ణాల మధ్య వివాదం చెలరేగింది. ఈ సందర్భంగా కొందరు రాళ్ల దాడికి పాల్పడడంతో పోలీసులతో పాటు ఇద్దరు గాయపడ్డారు. ఏదుట్లలో ప్రతి ఏడాది సంక్రాంతి, కనుమల సందర్భంగా కోటమైసమ్మకు బోనాలు నిర్వహించడం ఆనవాయితీ. సంక్రాంతి రోజు అగ్రవర్ణాలు, కనుమ రోజు దళితులు బోనాలు నిర్వహించడం చాలా కాలంగా కొనసాగుతోంది. అయితే తాము కూడా సంక్రాంతినాడే బోనాలు తీసుకెళ్తామని కొందరు దళితులు ఇటీవల తహసీల్దార్‌కు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల ఆరున ఏదుట్ల పంచాయతీ ముందు కులవివక్షపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంక్రాంతి రోజే దళితులు, అగ్రవర్ణాలు కలిసి బోనాలు తీసుకెళ్లాలని తహసీల్దార్ తీర్మానించారు.


అయితే 15న సంక్రాంతి సందర్భంగా అగ్రవర్ణాల వారు బోనాలకు వెళ్లకుండా టెంకాయలతో మైసమ్మకు మొక్కు తీర్చుకున్నారు. కొందరు దళితులు బోనాలు తీసుకెళ్తామని పోలీసులకు తెలిపారు. పోలీసు బందోబస్తు మధ్య బోనాలతో బయలు దేరారు. కోటమైసమ్మ గుడికి సమీపంలో కొందరు వారిని అడ్డుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకొని గ్రామస్థులను చెదరగొట్టేందుకు యత్నించారు. అదే సమయం లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చీకట్లో ఓ వైపు నుంచి రాళ్ల దాడి జరిగింది. దాడిలో పోలీసులతో పాటు రేమద్దులకు చెందిన రాములు, గోపాల్‌పేటకు చెందిన రఘు గాయపడ్డారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో దళితులు బోనాలను రోడ్డుపక్కనే ఓ అరుగుపై దించేసి వెళ్లిపోయారు. పోలీసులు గ్రామస్థులతో చర్చలు జరిపారు. బోనాలను పోలీసు వాహనంలో తీసుకెళ్లి పాఠశాల భవనంలో భద్రపరిచారు. సోమవారం దళితులు బోనాలకు వెళ్లాల్సి ఉన్నా, తాము వెళ్లబోమంటూ వారు పోలీసులకు సమాచారమిచ్చారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఉండడంతో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు.

అందరూ ఒకే రోజు బోనాలు జరుపుంటే ఏంటి నష్టం? ఎందుకు జరుపుకోకూడదు ? ఇప్పుడక్కడ పోరాటాలు చేసి ఖండించి దళితులు కూడా సంక్రాంతి రోజే బోనాలు జరుపుకునేలా చేస్తే మనం బాగుపడిపోయినట్టేనా ?

దళితులతో కలిసి చేసుకునేట్టయితే మేమసలు బోనాలే చెయ్యం అని అగ్ర వర్ణాల వాళ్ళు అంటే ఏం చెయ్యాలి ?

అసలు మన మీదా మన మెదళ్ళమీదా ఈ అత్యంత దుర్మార్గమైన వర్ణ/కుల వ్యవస్థ ప్రభావం లేదా? పుట్టుకని బట్టే మనుషుల్ని అంచనా వేసే దురాచారం వేరు వేరు రూపాల్లో మనలో కూడా ఉందా ?

ఇటువంటి సంఘటనల నుంచి మనం అర్థం చేసుకోవాల్సిందీ, ఆచరించాల్సిందీ ఏంటి?

21, డిసెంబర్ 2011, బుధవారం

తెలంగాణా సమస్య(Part 2) - అసలేం జరుగుతుంది !!!

అంతకు ముందు పరిస్థితులు ఎలా ఉన్నా 09 డిసెంబరు 2009 నుండీ పరిస్థితులు చాలా వేఘంగానూ, నిర్ణయాత్మకంగానూ మారాయి. ఎవరూ ఎవర్నీ నమ్మకపోవడం, ఎవరి వాదానికి వాళ్ళు 100% కమిటవ్వడం, పరిస్థితులు సంక్లిష్టంగా మారడం.. ఇదంతా అర్థం చేసుకోవాలంటే డిసెంబరు 2009 నాటి పరిస్థితుల్నీ తదనంతర పరిణామాలనీ చాలా నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.

07 డిసెంబరు 2009: అన్ని పార్టీలు తెలంగాణా ఏర్పాటుకి సైధ్ధాంతికంగా మద్దతు ప్రకటించాయి. కనీసం అభ్యంతర పెట్టడమైతే చెయ్యలేదు.
09 డిసెంబరు 2009: కేంద్ర ప్రభుత్వం, దాదాపుగా తెలంగాణా ఏర్పాటు చేసినంత ప్రకటన ఇచ్చింది.
10 - 23 డిసెంబరు 2009: సీమాంధ్ర ప్రతినిధుల రాజజీనామాలు(దాదాపు అన్ని పార్టీల వాళ్ళూ), సమైక్యాంధ్ర ఉద్యమం, ప్రజారాజ్యం పార్టీ తన విధానాన్ని సమైక్యవాదిగా మార్చుకోవడం
23 డిసెంబరు 2009: విస్తృతమైన సంప్రదింపులు అవసరాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం
24 డిసెంబరు 2009 - 05 జనవరి 2010: మళ్ళీ తెలంగాణా ఉద్యమం
ఫిబ్రవరి 2010 - జనవరి 2011: ఉద్యమంలోనూ, ఉద్యమాన్ని వ్యతిరేకించే వాళ్ళలోనూ కొంత స్తబ్దత, శ్రీక్రిష్ణ కమిటీ అభిప్రాయ సేకరణ చెయ్యటం
జనవరి 2011 నుండి: మళ్ళీ కేంద్రం ఎటూ తేల్చక పోవటం, ఉద్యమం ఊపందుకోవటం, ఆవేశాలూ, సమ్మెలూ, సవాళ్ళూ, ప్రతిసవాళ్ళూ ఇంతే కాకుండా అర్థం లేని రాజీనామాలూ వాటికి అంతకంటే అర్థంలేనీ, అర్థం కాని తిరస్కరణలు.

ఈ దశలన్నీ చూసినప్పుడు కొన్ని ఆలోచించవలసిన విషయాలు ఏంటంటే:

1. డిసేంబరు 7 న ఏ అభ్యంతరమూ వెలిబుచ్చని సీమాంధ్ర ప్రతినిధులు మూడురోజుల తరవాత ఎందుకలా ప్రతిస్పందించారు?

డిసెంబరు 7 న పార్టీలన్నీ చెప్పిన దాని ప్రకారమైతే డిసెంబరు 9 ప్రకటన అంత ఆగ్రహం తెప్పించే విషయం కాదు. కాని తప్పకుండా సీమాంధ్ర ప్రాంత ప్రజల్లో చాలా నిరసన వ్యక్తం అయ్యింది. నాదృష్టిలో ఆ నిరసన అసలు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కంటే, ప్రకటన చేసిన విధానం మీదే అనిపిస్తుంది. ఎందుకంటే అప్పటికి ఉన్న పరిస్థితుల్లో ఆప్రకటన రావడం, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తెలంగాణా వాదుల పక్షపాతిగానూ, సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలకి విలువ ఇవ్వనట్టుగానూ కనిపించింది.

అలా అయితే మరి 7వ తారీఖున సీమాంధ్ర ప్రతినిధులు ఎందుకు ఒప్పుకున్నట్టు !! అసలప్పటికే దాదాపు అన్ని ముఖ్య పార్టీలూ తెలంగాణా ఏర్పాటుకి తమ మద్దత్తు ప్రకటించి ఉండటం ఒక రాజకీయ కారణమైతే, అసలు నిర్ణయం తీసుకోబోయే ముందు ప్రజాభిప్రాయాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటారు అప్పుడు చూసుకోవచ్చులే అనే అలసత్వం కారణం కావచ్చు.

2. చేసిన తప్పు దిద్దుకునే పనిలో భాగంగా విస్తృత స్థాయి చర్చలు జరగాలని కేంద్రం ప్రకటించింది. శ్రీక్రిష్ణ కమిటీ ఏర్పాటు ఆ ప్రకటనకి కొనసాగింపే.

కమిటీ మాత్రమే కాదు ఇంకా ఈ ఈ పద్దతుల్లో విస్తృత చర్చలు చేస్తాము అని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదు కాబట్టి, కమిటీ రిపోర్టు తరవాత స్పష్టంగా స్పందించవలసింది కేంద్రమే. కనీసం ఒక రోడ్ మ్యాప్ అన్నా ఇవ్వాలి. ఏమీ చెయ్యకుండా సంవత్సరం పాటు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటే ఇరువైపుల ప్రజల సహనానికి ఉండే హద్దుల్ని పరిక్షించటం కాకపోతే మరేంటి? సంతోషించాల్సిన విషయమెంటంటే, ఈ సహన పరిక్షలో రాష్ట్రప్రజలు చాలా వరకూ విజయం సాధించారనే చెప్పుకోవచ్చు (ఇరుప్రాంతాల వారు కూడా).

3. ఆసలు ఈ విషయం మీద తమకంటూ ఒక విధానం ఏర్పరుచుకున్న పార్టీలు ఏవేవి? అసలు తమ తమ పార్టీలని ఒక విధానం వైపుగా నడిపించే ప్రయత్నాలు చేస్తున్న పార్టీలు ఏవి?

వీటికి సమాధానాలు ఆలోచించగలిగితే జరుగుతున్న పరిస్థితులని సరిగ్గానే అంచనా వెయ్యగలం అనిపిస్తుంది.

23, సెప్టెంబర్ 2011, శుక్రవారం

తెలంగాణా సమస్య(Part 1) - ప్రత్యేక రాష్ట్రం ఎందుకు ?


తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కావాలని ఎందుకడుగుతున్నారు? దేశం మీద ఈ అంశం ప్రభావం ఎలా ఉంటుంది? సమైక్య రాష్ట్రం మీదగానీ, రెండు ప్రత్యేక రాష్ట్రాల మీదగానీ దీని ప్రభావం ఏవిధంగా ఉండబోతుంది? అసలీ సమస్య ఇంత జఠిలంగా ఎందుకు తయారయ్యింది? ప్రాంతాల వారీగా కాకుండా అసలు ఈ విషయం మీద వివిధ పార్టీల ఆలోచనా విధానం ఏంటి? తప్పో రైటొ ఇప్పుడున్న పరిస్థితి నుండి మార్గాంతరాలేంటి? ప్రత్యేక రాష్ట్రం వద్దనే వాళ్ళు ఎందుకు వద్దంటున్నారు?

అన్నీ ప్రశ్నలే. సమాధానాలెక్కడ? నాకు వీలయినంత వరకూ నిష్పక్షపాతంగా(?) ఈ విషయం మీద నా ఆలోచనలు రాద్దామంటే, ఒక టపా సరిపోయేట్టులేదు. సరే వీలయినంతవరకూ మన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరికే వరకూ వరసగా టపాలు రాద్దామని నిర్ణయించుకున్నాను. మీ అభిప్రాయాలు చెప్పి మంచి చర్చ చేస్తారని ఆశిస్తున్నాను.

ప్రత్యేక రాష్ట్రం ఎందుకు ?

అసలు ప్రత్యేక రాష్ట్రం ఎందుకడుగుతున్నారు? గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న అనేక వాదనలూ, విశ్లేషణలూ చూస్తే స్థూలంగా తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కి కారణాలు 5. ఈ కారణాలన్నిటినీ పరిశీలిస్తే, అర్థమయ్యేదేంటంటే, ఇందులో కొన్నేమో గణాంకాల ఆధారంగానూ, డాక్యుమెంట్ల ఆధారంగానూ విశ్లేషణ చెయ్యడానికి వీలయ్యేవీ, మరికొన్నేమో అలా వీలు కానివీ. ఇందులో కొన్ని ఎక్కువా కొన్ని తక్కువా అనేదేమీ లేదు నాదృష్టిలో. అన్నీ బలమైన కారణాలే. వీటిల్లో నిజానిజాల్నీ, అపోహలనీ బేరీజు వేద్దాం.

ఎవరికి వీలయిన గణాంకాలు వాళ్ళు తీసుకొచ్చి, మధ్యలో ఒక కారణం నుంచి ఇతర కారణాల వైపు చర్చని దారి మళ్ళిస్తూ కలగాపులగం చెయ్యటం అనేది విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో గత కొన్నేళ్ళుగా జరుగుతున్న తంతే. మళ్ళీ మనమెందుకు అదే చెయ్యటం!! మనం అన్ని కారణాలనీ ఒక్కొక్కదాన్నీ విడివిడిగా, సరళంగా విశ్లేషిద్దాం.

1. తెలంగాణా ప్రాంతం అభివృధ్ధిలో వెనకబడి ఉండటం

ఇది ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అవసరమైన కారణమా కాదా అనేది కాసేపు పక్కనపెడదాం. ఎందుకంటే, ముందు వెనకబాటుతనం ఉంది అని నిరూపణ అవ్వాలి, తరవాత వెనకబాటుతనం ప్రత్యేక రాష్ట్రంగా లేకపోవడం వల్లే అని నిర్ధారింపబడాలి. ప్రభుత్వం వారి లెక్కలు గానీ లేదా అదే పనిగా ఈ విషయం కోసమే నియమించబడ్డ శ్రీక్రిష్ణ కమీటీ లెక్కలుగానీ చూస్తే 1956 తరవాత జరిగిన అభివృధ్ధిలో ఈ ప్రాంతం వెనకబడి లేదనేది కనిపిస్తుంది. స్థూలంగా వెనకబాటుతనం ఉన్నా అది అన్ని ప్రాంతాలలోనూ ఉంది. 1956 తరవాత హైదరాబాదు లో అన్ని ప్రాంతాల పెట్టుబడిదారుల డబ్బు వల్లా అన్ని ప్రాంతాల ప్రజల శ్రమ వల్లా ఎక్కువగా అభివృధ్ధి జరిగిందనేది నాకైతే బాగానే కనిపించింది.

2. ఆర్థికాంశాల్లోనూ, పరిపాలనాంశాల్లోనూ ఈ ప్రాంతం నిర్లక్ష్యం చెయ్యబడుతూ ఉంది

ప్రభుత్వ పరంగా జరిగిన కేటాయింపులూ, ఇతరత్రా వివరాలు చూస్తే ఈ కారణం కూడా పెద్దగా నిలబడలేదనే చెప్పొచ్చు. నీటి లభ్యత మాత్రం తక్కువగానే కనిపిస్తుంది. ఉద్యోగాల విషయంలో ప్రైవేటు ఉద్యోగాల విషయంలో ఈ ప్రాంతవాసులకి మిగతావాళ్ళతో పోలిస్తే తక్కువ ఉద్యోగాలు లభించిన మాట వాస్తవమే అయినా, అది ప్రత్యేక రాష్ట్ర అంశానికి సంబంధం లేని విషయమే. నీటి వనరుల విషయంలో మాత్రం తేడా స్పష్టంగా కనిపిస్తుంది. కాకపోతే, ఎక్కువ పెట్టుబడి పెట్టి తక్కువ ఫలితాలు సాధించడం కంటే, ఈ ప్రాంతానికి వీలైన ఇతర రంగాల్లో నిధులు పెట్టి మంచి ఫలితాలు సాధించడమే మంచిది కదా ! ప్రకాశం జిల్లా గానీ, లేదా గుంటూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలు గానీ ఇదే పరిస్థితుల్లో ఉన్నాయి. దాన్నీ నిర్లక్ష్యం అనలేము కదా !

3. 1956 లో ఒకే రాష్ట్రంగా ఏర్పడినప్పుడు చేసిన ఏర్పాట్లేవీ చిత్తశుద్దితో అమలు జరగలేదు కాబట్టి ఇక ముందైనా మధ్యేమార్గంగా చేసే ఏర్పాట్ల మీద ఈ ప్రాంత ప్రజలకి నమ్మకం లేదు.

శ్రీక్రిష్ణ కమీటీ ప్రకారం చూసుకున్నా మరే ఇతర ఆధారాల ప్రకారం చూసినా ఒప్పందాలు సరిగ్గా అమలు చెయ్యబడలేదు అనేది మాత్రం స్పష్టం. అసలు ఆ ఒప్పందాల్లోని షరతులే తప్పు కాబట్టి అవి అమలు జరక్కపోయినా తప్పేంలేదు అనే వాదన అర్థ శతాబ్దం తరవాత ఇప్పుడు చెయ్యడం మాత్రం అర్థంలేని పని. ఒకవేళ ఇప్పుడేదైనా పకడ్బందీ ఏర్పాటు చేద్దామన్నా ఈ ప్రాంత ప్రజలు దాన్ని విశ్వసించడానికి సిధ్ధంగా లేకపోతే అది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళ పరిస్థితుల్లో ఎవరున్నా అంతే కదా !

కేవలం ఒప్పందాల అమలులో లోపాలవల్లే తెలంగాణా కోసం ఇంత పోరాటం చేస్తున్నారా ? ప్రత్యేక రాష్ట్రం కోసం ఇంత పోరాటం ఎందుకు జరుగుతున్నట్టు ? మిగతా ఏవైనా కారణాలుండే ఉండాలిగా. అయితే వాటిని ఇదమిధ్ధంగా తేల్చడం గణాంకాలూ, డాక్యుమెంట్ల తో అయ్యేపని కాదు. కానీ అవేమీ తక్కువ చేసి చూడాల్సిన అంశాలేం కాదని నేను అనుకుంటున్నాను.

4. సమైక్య రాష్ట్రంలో తెలంగాణా ప్రాంత ప్రజల ఆకాంక్షలకీ, ఆశలకీ, సమర్ధతకీ సరైన అవకాశాలు దొరకడం దుర్లభం అనే భావన

పైన చెప్పబడిన మొదటి రెండూ అంశాల ప్రకారం చూస్తే, ఈ భావన కలగడం ఎలా సాధ్యం ! కానీ ఈ భావనా, అభద్రతా చాలా బలంగానే ఉంది ఈ ప్రాంతంలో. ఏమై ఉండొచ్చు ? తెలంగాణా మీద మిగిలిన ప్రాంతాల సాంస్కృతిక ఆధిపత్యం వల్ల అవకాశాలూ తగ్గి ఇటువంటి భావన ప్రబలే అవకాశం ఉంది. మొదటి రెండూ అంశాల్లో కూడా గణాంకాల ప్రకారం అంతా సవ్యంగానే ఉన్నా, ఈ ప్రాంత ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ఇంత బలంగా ఉందంటే, బహుశా గణాంకాల్లోని న్యాయం ప్రజలకి అనుకున్నంతగా అందలేదేమో !!

5. ఈ ప్రాంత ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష బలంగా ఉంది. పరిపాలనాపరంగా బానే ఉండి మిగిలిన వారికి నష్టం లేనప్పుడు ఎందుకివ్వకూడదు?

ఇదికూడా ఒక రకంగా బలమైన వాదనే. ఈ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష బలంగా ఉందనేది నిజమే. ఇక తేలాల్సింది, పరిపాలనా పరంగా బానే ఉంటుందా మిగిలిన వారికి ఏమైనా నష్టాలున్నాయా అనే రెండు విషయాలు. అధికార వికేంద్రీకరణ అనే సూత్రం ప్రకారం మంచిదేగానీ, ఒక రాష్ట్ర ఏర్పాటు మాత్రమే దానికి పరిష్కారం కాదు. స్థానిక సంస్థలని రాజ్యాంగ ప్రకారం నడిపితే ఇంకా మంచి ఫలితాలొస్తాయి. కాకపోతే ఆ పని సమైక్య రాష్ట్రంలో ఇప్పటివరకూ అనుకున్నంతగా జరగలేదు. అదట్లా ఉంచితే, దాదాపుగా 4 కోట్ల మంది జనాభా ఉన్న ప్రాంతం ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే పరిపాలనా పరంగా గానీ, వనరుల పరంగా గానీ బానే ఉంటుందనిపిస్తుంది.

ఏమీ నష్టం లేకుండానే మిగిలిన ప్రాంతాల్లో అంత వ్యతిరేకత ఎందుకుంటుంది? ముఖ్యంగా ఉపాధి అవకాశాలుగానీ, పెట్టుబడికి అనుకూలతలుగానీ హైదరాబాదు లో మాత్రమే ఉన్నాయి. మిగిలిన చోట్ల అటువంటి అవకాశాలు కల్పించడంలో సమైక్య రాష్ట్రం విఫలమవ్వడం వల్ల హైదరాబాదుని ఒక్కసారిగా ఒదులుకోవడం మిగిలిన ప్రాంతాల వారికి ఖచ్చితంగా నష్టమే, అభ్యంతరకరమె. మిగిలిన అంశాల విషయానికొస్తే, నీటి విషయంలోగానీ, హైదరాబాదు నుండి సమైక్య రాష్ట్రానికి ఒనగూరుతున్న ఆర్థిక వనరులనన్నిటినీ కోల్పోవడమంటే అది మిగిలిన ప్రాంతాలకి తప్పకుండా నష్టం కలిగించే అంశమే. మరీ ముఖ్యంగా తెలుసుకోవలసిందేంటంటే, రాష్ట్ర రాజధాని కాబట్టే ఇక్కడ మాత్రమే మిగిలిన ప్రాంతాలకంటే ఎక్కువ అభివృధ్ధి జరుగుతున్నా ఇంత కాలంగా అందరూ దాన్ని సహిస్తూ, సహకరిస్తూ వచ్చారనేది నిర్వివాదాంశం. కేవలం హైదరాబాదు మాత్రమే అభివృధ్ధి చెందడం అనేది తప్పైనా, ఇప్పుడు మనమున్న వాస్తవ పరిస్థితి మాత్రం ఇదే.

ఇవి కాకుండా ఇంకేవైనా కారణాలు నేను గమనించలేకపోయున్నా, ఈ కారణాలని అర్థం చేసుకోవడంలో పొరపాట్లున్నా మీ అభిప్రాయాలు చెప్పండి.


హిందూయిజం అంటే ??


ఇదేమీ బాగా ఆలోచించి ఆ ఆలోచనలని చర్చకి పెట్టే టపా కాదులెండి. ఈ కింది ఫోటో చూడగానే మనసుకి అనిపించింది రాస్తున్నానంతే. వెయ్యి సంవత్సరాల నుండీ ముస్లీములు హిందువులని అణగదొక్కారనీ, హిందువులు ముస్లీంల మీద ఆధిపత్యం కోసమే ప్రయత్నిస్తున్నారనీ, ఈ దేశం హిందువులది మాత్రమే అనీ, కాదు అందరిదీ అనీ రకరకాల వాదనలు చేసే వాళ్లంతా ఇదొక్కసారి చూస్తే తమ వాదనలని సరిచూసుకునే అవకాశం దొరుకుతుందనే ఆశ, అంతే. ముఖ్యోద్దేశ్యం మాత్రం ఈ ఫోటోని అందరితో పంచుకోవడమే.





సుప్రీం కోర్టు చెప్పినట్టు, హిందూయిజం అనేది ఒక జీవన విధానం మాత్రమే అంతకంటే ఇంకేమీ కాదు.

మిత్రుడు సీతారం ఫేస్ బుక్ లోనుండి తీసుకున్నాను ఫొటొ. Thank you Sitaram RNV. You made my day :)